మన దేశంలో నిత్యం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా మానవులు - వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు పెరుగుతున్నాయనే అంశంపై రాసిన కథనంలో రెండో భాగం ఇది. మొదటి భాగాన్ని ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 190 రామాపురం అనే అందమైన గ్రామంలో, వి. రాకేష్ శర్మకు చెందిన రెండు ఎకరాల భూమి మాత్రమే నిరుపయోగంగా నిలిచింది.
అక్కడ కొన్ని ఎండిన వేరుశెనగ మొక్కలు నిర్లక్ష్యానికి గురైన స్థితిలో ఉన్నాయి. కానీ వాటిని తొలగించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నిర్లక్ష్యానికి గురైన ఈ దృశ్యం గ్రామస్థుల హృదయాల్లో తీవ్ర విషాదాన్ని రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఈ భూమి గతంలో వేరుశెనగ, మిరప, ఇతర స్వదేశీ కూరగాయ పంటలను సమృద్ధి ఉత్పత్తి చేసి మంచి దిగుబడినిచ్చేది.
నలుగురు సభ్యులున్న శర్మ కుటుంబాన్ని ఈ భూమి పోషించింది. అతని తల్లిదండ్రులు ప్రతిరోజూ ఉదయం ఎంతో సంతోషంగా కలిసి మెలసి పొలాల్లో పని చేసేవారు.
30 ఆగస్టు 2023లో ఒక ఊహించని విపత్తు ఎదురైంది. తొలిసారి ఒక అడవి ఏనుగు వీరి గ్రామంలోకి ప్రవేశించడం కలకలం రేపి, శర్మ తండ్రిపై దాడి చేసింది. ఆయనపై దాడి చేసిన ఏనుగును తరిమేందుకు ప్రయత్నించిన అతని తల్లిపై కూడా దాడి చేసింది. ఈ దుర్ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఇప్పుడు, శర్మతో పాటు అతని సోదరుడు పొలంలోకి వెళ్లడం మానేశారు. “ఎందుకంటే ఇది మా తల్లిదండ్రుల మరణం తాలూకా బాధాకరమైన జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది," అని అతను “ది జైలం తో” చెప్పాడు. ఈ విషాద సంఘటన వల్ల వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆ కుటుంబం ఇతర ఉపాధిని వెతుక్కునేలా చేసింది. అటవీశాఖ మొత్తం ₹10 లక్షలు (దాదాపు $12,000కి సమానం) అయిన నష్టపరిహారాన్ని జారీ చేసినప్పటికీ, తల్లిదండ్రులు లేని లోటును పూడ్చలేకపోయిందని శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటవీ నాశనం, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఏనుగులు ఆహారం, నీటి కోసం తమ సహజావాసాలను విడిచి వెళ్ళాల్సి వస్తోంది. దీని ఫలితంగా మానవ నివాసాలకు అంతరాయం ఏర్పడడంతో ఏనుగులకు గ్రామస్తులకు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి.
చిత్తూరు జిల్లాలోని మాదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆర్. గణేష్ తండ్రి 2023 ఆగస్టులో ఒకరోజు సాయంత్రం తన రెండెకరాల వరి పొలానికి సాగునీరు పెట్టేందుకు వెళ్తుండగా అడవి ఏనుగు దాడి చెయ్యడంతో మృతి చెందారు. దీంతో గణేష్ వ్యవసాయాన్ని వదిలి రోజువారీ కూలీగా మారాడు.
“రాత్రుళ్లు చీకట్లో బయటకు రావద్దని అటవీ శాఖాధికారులు సూచిస్తుండగా, ప్రభుత్వం పంటపొలాలకు రాత్రిపూట విద్యుత్‌ను అందిస్తుండటంతో అప్పుడే పంటలకు నీరందించడానికి వెళ్లాల్సి వస్తోంది” అని గణేష్ పేర్కొన్నారు.
వారి కుటుంబంలో జరిగిన అనుకోని విషాదం వారి జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీసింది. అనేకమంది ఇతర రైతుల్లాగే, అతడు తన నష్టాన్ని పూడ్చుకునేందుకు కూలి పనిలో దిగాడు.
ఇప్పుడు గణేష్ కుటుంబ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మరింత దిగజారడంతోపాటు కుటుంబ పెద్ద దిక్కు లేని లోటు నిరంతరం ఆయనను వేధిస్తోంది. పొలాల్లో తండ్రితో కలిసి రాగిసంగటితో చేసిన భోజనాన్ని తింటున్న రోజులు గుర్తుకు వచ్చినప్పుడల్లా తన తండ్రి తమతో లేడని కన్నీటిపర్యంతమవుతున్నారు.
ప్రభత్వ పరిహారం ఒక్కటే సరికాదు
పంటపొలాలు అధికంగా ఉన్న చిత్తూరు జిల్లా తమిళనాడులోని కావేరి ఉత్తర వన్యప్రాణుల అభయారణ్యానికి, కర్ణాటకలోని బన్నెరఘట్ట నేషనల్ పార్క్‌కు మధ్యలో ఉంది. గత దశాబ్ద కాలంగా ఏనుగులు మనుషుల జీవన్మరణ పోరాటంలో జిల్లాలో 6,900కు పైగా ఏనుగుల దాడులు మానవులపై జరిగాయి. వీటిలో 26 మంది మనుషులు, 50కి పైగా పశువులపై ఏనుగులు దాడి చేసి చంపాయి. అంతేకాక దాదాపు ఆరు వేల ఎకరాలకుపైగా పంటపొలాలు ధ్వంసమయ్యాయి.
అయితే ఈ ఘటనల్లో బాధితులకు అత్యల్ప పరిహారం మాత్రమే అందింది. వీరు నష్టపోయిన చెరకు, వరి పొలాలకు సగటున ఎకరాకు రూ. 6,000, దెబ్బతిన్న కొబ్బరి, మామిడి చెట్లకు ఒక్కో చెట్టుకు రూ. 1,500 పరిహారాన్ని మాత్రమే ప్రభుత్వం నిర్ణయించింది.
ఏనుగుల దాడుల్లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
ది జైలంకు ఇంటర్యూ ఇచ్చిన ఎనిమిది మంది రైతుల్లో ఐదుగురు తమ దెబ్బతిన్న పంటలకు ఎలాంటి పరిహారం అందలేదని, మరికొందరు ఆశించిన మొత్తం కంటే తక్కువగానే అందుకున్నామని తెలిపారు.
అడవి జంతువుల వలన సంభవించే మానవ మరణాలకు అందించే ఎక్స్‌గ్రేషియాను ఒక్కో మరణానికి రూ. 10 లక్షలకు పెంచుతూ 2024 ఆగస్టులో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులు అక్టోబర్ 2024 నాటికి అమలుకు నోచుకోలేదు.
చాలా మంది బాధితులకు ప్రభుత్వం అందించే నష్ట పరిహారం స్వల్పంగా ఉండటంతోపాటు సకాలంలో అందడం లేదు. మృతుల కుటుంబాలు ఆర్థికంగా నిలబడేలా ఆయా కుటుంబాల్లోని సభ్యులకు ప్రభుత్వోద్యోగాలు కల్పించాలని అటవీ శాఖను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Caste system still creates a disadvantage
చిత్తూరు జిల్లాకు చెందిన రైతు టి. నాగరాజు ఏడాది క్రితం ఏనుగుల గుంపు అతని పొలంపై దాడి చేసినప్పుడు, తన 140 మామిడి చెట్లలో సగాన్ని కోల్పోయాడు. అయితే ఏడాది గడిచినా ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం అందలేదు.
“అగ్రవర్ణాల రైతులు ఏనుగుల దాడితో దెబ్బతిన్న పంటలకు నెలలోనే ప్రభుత్వ పరిహారం పొందుతుంటే” దళిత కులానికి చెందిన 40 ఏళ్ల రైతు మాట్లాడుతూ తాను దళితుడిగా పుట్టడం వల్ల నేటికీ బహిష్కరణ, అంటరానితనానికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలో కులం ఇప్పటికీ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దళితులను ఎలా పరిగణిస్తున్నారనే విషయంలో పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక భద్రత లేకపోవడం వంటి అంశాలు పరిహారం పొందడంలో, సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వేసవి కాలంలో సాధారణంగా నాగరాజు మామిడి పళ్ల అమ్మకం ద్వారా రూ. 50 వేల (సుమారు $600) వరకు ఆదాయాన్ని పొందగా, ఈ సంవత్సరం అతనికి ఆదాయం లేకుండా పోయింది.
"మా గ్రామంలో ఏనుగులు ఒక వ్యక్తిని చంపిన తర్వాత నా ప్రాణాలకు భయపడి నేను మిగిలిన చెట్లను చూసుకోలేదు" అని నాగరాజు చెప్పారు.
ప్రస్తుతం అతను కూలీ పనుల కోసం మూడు గంటలు ప్రయాణించి వివిధ ప్రాంతాలకు వెళ్లి రోజుకు 14 గంటల పని చేసి, రూ. 400 (సుమారు $5) సంపాదిస్తున్నాడు. సొంత పొలంలో దర్జాగా సాగు చేసుకునే అవకాశాన్ని కోల్పోయి, ఉపాధి కోసం తిరగాల్సి వస్తోందని నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
చిత్తూరు జిల్లాలో అనేక కుటుంబాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. టేకుమండ గ్రామంలో నివసించే సి. పరదేశి తన వరి పొలాలు ఏనుగుల బారిన పడి నష్టపోవడంతో కొంత పరిహారాన్ని అందుకున్నాడు. కానీ ఇది అతని పొలంలో పని చేసిన కూలీల ఖర్చులకు కూడా సరిపోలేదు. మెట్ట మీద రాచపల్లి గ్రామానికి చెందిన బసవ తన పొలంలోని సారవంతమైన నల్లరేగడి నేలలో టమోటా సాగును ఏనుగుల దాడుల వల్ల మానుకోవాల్సి వచ్చింది. గత ఏడాది కాలంలో తన వరి, మామిడి, టమోటా పంటలను ఏనుగులు మూడుసార్లు నాశనం చేశాయని చెబుతున్నాడు.
ప్రకృతి వైపరీత్యాల బాధితులతో పోలిస్తే ఏనుగుల దాడులతో నష్టపోయిన బాధితులకు చాలా తక్కువ పరిహారం అందుతోంది. సాధారణంగా పంట నష్టానికి రెండు నుంచి నాలుగు రెట్లు పరిహారం అందుతుందని రాష్ట్ర ఉద్యానవన శాఖలో పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి తెలిపారు.
చెల్లింపుల్లో జాప్యం కారణంగా అటవీ శాఖ ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు ప్రతిపాదించిందని చిత్తూరు మాజీ జిల్లా అటవీ అధికారి సి. చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా, రైతులు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అలాగే దరఖాస్తు స్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు బాధితుల దరఖాస్తులను పరిశీలించి ఒకటి లేదా రెండు రోజుల్లో వాటిని ఆమోదిస్తారని ఆయన వెల్లడించారు.
దాడుల నివారణకు ప్రభుత్వ ప్రయత్నాలు
ఆహార పంటలు ఇతర పంటల కంటే దాదాపు 400 రెట్లు ఎక్కువగా ఏనుగుల దాడికి గురవుతున్నాయని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రైతులు తమ పొలాలను కాపాడుకునేందుకు ఏనుగులకు అంతగా నచ్చని నిమ్మ గడ్డి వంటి పంటలను సాగు చేస్తున్నారు.
అడవుల్లో నివసించే ఇతర ప్రాంత ఏనుగులు కూడా ఆహారం కోసం వెతుక్కుంటూ స్థానికంగా నివసించే ఏనుగుల ఆహార వనరులను కొల్లగొడుతుండడంతో అందుబాటులో ఉన్న ఆహార వనరులు స్థానిక జాతుల ఏనుగులకు దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఏనుగుల సహజ ఆవాస, ఆహార వనరులు చెదిరిపోవడం, అటవీ నిర్మూలన, అడవుల ఆక్రమణలు, మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా అవి తినని నిమ్మగడ్డి వంటి పంట పొలాల వైపు కూడా ఏనుగులు ఆకర్షితులవుతున్నాయి.
“పర్యావరణ సహితంగా మన జీవనాలు మారాల్సిన అవసరం ఉంది. ప్రకృతితో మమేకమైన జీవనం - సకల ప్రాణులకు హితం అన్నట్లు ఈ దీర్ఘకాల సమస్యను పరిష్కరించడానికి, గజరాజుల కోసం సరైన నివాస నిర్వహణ అవసరమని, అలాగే రిజర్వ్ ఫారెస్టులలో, అటవీ సరిహద్దుల అంచులలో పశుగ్రాస ప్లాట్లను ఏర్పాటు చేయడం, తద్వారా వాటి నివాస స్థలంలో తగినంత ఆహారం ఉండేలా చెయ్యడం వంటివి, ఈ సమస్యకు ప్రభావవంతమైన పరిష్కారమని” రెడ్డి చెప్పారు.
అయితే ఈ దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేస్తున్నప్పుడు, తక్షణమే సాయపడే స్వల్పకాలిక పరిష్కారాలను అందించడం కూడా అవసరం. ఈశాన్య భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏనుగుల కమ్యూనికేషన్ను అధ్యయనం చేసే “ఎలిఫెంట్స్ అకౌస్టిక్స్ ప్రాజెక్టు”కు చెందిన సీమా లోఖండ్వాలా అభిప్రాయం ప్రకారం, ఏనుగుల కదలికలను ట్రాక్ చేయడం, సమస్యలను సృష్టించే లోపాలను గుర్తించి పరిష్కరించడం ద్వారా ఈ వైరుధ్యాలను నివారించవచ్చు.
2021లో ఒడిశా రాష్ట్రంలో ఏనుగులపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ఏనుగులు - మానవుల జీవన్మరణ పోరాటాలపై దృష్టి సారించి వాటి పరిధి, ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించడంలో అది సహాయపడుతుంది.
“ఆసియా ఏనుగుల గుంపులు 100 నుంచి 1,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయని” అధ్యయనం చేసిన బిప్లవ్ కుమార్ గురు, అమరేంద్ర దాస్ తమ అధ్యయనంలో వెల్లడించారు. “1.3 బిలియన్ల మానవ జనాభా ఉన్న భారతదేశం వంటి దేశంలో భారీ పరిధిలో గృహ నివాసాలు ఉండటంతో ఏనుగుల మందలు తరచుగా దాడులు చేస్తాయని వారు భావిస్తున్నారు.” కానీ వాటి దాడులకు ప్రభావితమవుతోన్న ప్రజలపై తగిన శ్రద్ధ కనబరిచి, వారికి త్వరితగతిన నష్టపరిహారం చెల్లించనప్పుడు, వారు వన్యప్రాణులపై ద్వేషం పెంచుకుని, వాటి పరిరక్షణ ప్రయత్నాలకు సహకరించకపోవచ్చని సదరు అధ్యయనం వెల్లడిస్తోంది.